📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్అంగన్వాడి పేరుతో సైబర్ మోసం… యువకుడి నుంచి రూ.19 వేల కాజేసిన నేరగాళ్లు

అంగన్వాడి పేరుతో సైబర్ మోసం… యువకుడి నుంచి రూ.19 వేల కాజేసిన నేరగాళ్లు

📰 Generate e-Paper Clip

– హెల్త్ డిపార్ట్మెంట్ పేరుతో ఫోన్ చేసి మోసం
– ప్రభుత్వ పథకం పేరుతో వివరాలు సేకరణ
– అమాయకుడిని నమ్మించి డబ్బులు బదిలీ చేయించిన దుండగులు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

హోళగుంద, మార్చి 13 (స్ఫూర్తి పత్రిక):

రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలు కొత్త కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ పథకాల పేరుతో ఫోన్ చేసి డబ్బులు కాజేసే ఘటనలు పెరుగుతున్నాయి.

హోళగుంద మండల కేంద్రానికి చెందిన షాకీర్ అనే యువకుడికి ఇటీవల +91 72899 82513 నంబర్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. అంగన్వాడి మరియు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన వ్యక్తి, ప్రభుత్వం ద్వారా మొదటి కాన్పుకు రూ.6000 ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నాడు.

అందుకు సంబంధించి బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్‌పే నంబర్ తదితర వివరాలు అవసరమని చెప్పడంతో బాధితుడు అవి అందించినట్లు సమాచారం. అనంతరం ఆ వ్యక్తి బాధితుడి బ్యాంక్ ఖాతా జీరో ఖాతా కావడంతో డబ్బులు జమ కాలేదని చెప్పి, ఫినో పేమెంట్స్ బ్యాంక్‌లో కొత్త ఖాతా తెరవాలని సూచించినట్లు తెలుస్తోంది.

తదుపరి ఖాతా యాక్టివేషన్ కోసం ముందుగా రూ.10,000, తరువాత రూ.5,000, మళ్లీ రూ.4,000 ఫోన్‌పే ద్వారా జమ చేయాలని చెప్పడంతో బాధితుడు మొత్తం రూ.19,000 బదిలీ చేసినట్లు సమాచారం. డబ్బులు పంపించిన తర్వాత ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌గా రావడంతో మోసం జరిగిన విషయం బయటపడింది.

దీంతో బాధితుడు తన స్నేహితులకు విషయం తెలియజేయగా ఇది సైబర్ మోసం కావచ్చని వారు సూచించారు. అనంతరం బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేయకూడదని పోలీసులు కూడా తరచుగా హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!