sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 3:30 pm Digital Edition : SPHOORTI PATRIKA

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు రైతులకు వరం

– దేవనకొండలో మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమం
– రైతు సేవా కేంద్రంలో పథకంపై అవగాహన
– అర్హులైన రైతులకు విడతల వారీగా ఆర్థిక సహాయం
– వ్యవసాయ అధికారి ఉషారాణి వివరాలు

దేవనకొండ, మార్చి 13 (స్ఫూర్తి పత్రిక):

దేవనకొండ మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి బి. ఉషారాణి హాజరై పథకం వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సాయం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రూ.7,000, రబీ సీజన్‌లో రూ.7,000, వేసవి సీజన్‌లో రూ.6,000 చొప్పున రైతులకు నిధులు అందనున్నట్లు వివరించారు.

అదేవిధంగా భూమిలేని కౌలు రైతులకు మొదటి విడతలో నిధులు అందకపోయినా, రబీ మరియు వేసవి సీజన్లలో చెరో రూ.10,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా దేవనకొండ మండలంలోని మూడో విడతలో మొత్తం 15,220 మంది రైతులకు రూ.9 కోట్ల 13 లక్షల 20 వేల నిధులు జమ కానున్నట్లు వెల్లడించారు. ఈ పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, సొసైటీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్, ఆలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లెపల్లె రంగుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సరోజ, మండల ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, మాజీ ఎంపీటీసీ ఆకుల వీరేష్, మాల బండ్లయ్య, జనసేన నాయకుడు ఉచ్చురప్ప, ఆర్మీ రామంజి, నాగరాజు, టిడిపి నాయకుడు రాజ గౌడ్, మాజీ సర్పంచ్ మల్లికార్జున, వ్యవసాయ విస్తరణ అధికారులు రంగన్న, మల్లికార్జున, గ్రామ వ్యవసాయ సహాయకులు కళావతి, హసీనా మరియు రైతులు పాల్గొన్నారు.