దేవనకొండలో కార్మికులకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నేతలు.
దేవనకొండ,ఫిబ్రవరి(స్ఫూర్తి పత్రిక) కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని వివిధ కార్మిక సంఘాల కార్మికులకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వీరశేఖర్, ఏఐటియుసి జిల్లా నాయకులు ఎమ్.నరసరావు లు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం దేవనకొండలో సిఐటియు మండల కార్యదర్శి ఎమ్.అశోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ఈనెల 12వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మె 4 లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం కార్మికుల హక్కులకు భంగం వాటిల్లుతుందని, సమ్మె చేసే హక్కు, వేతనాలు పెంచాలని, భేరసారాల హక్కు, సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు, పనిగంటలు ఎనిమిది నుండి 12 గంటలకు పెంచడం పై, ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులకు హక్కులు లేకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసమే సమ్మె జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్నారు. మున్సిపల్, మెడికల్, విద్యుత్తు, విద్య, ఆర్టీసీ ఇలా అనేక రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. స్కీం వర్కర్లైన ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, 108, 104, ఆరోగ్య మిత్ర, మెప్మా, ఆర్పి లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. అసంఘటితరంగా కార్మికులైన ఆటో, హమాలీ, స్ట్రీట్ వెండర్స్, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చికెన్, మటన్ షాపుల్లో పనిచేసే కార్మికులు, వెల్డర్స్, క్వారీల్లో పనిచేసే కార్మికులు అందరికీ సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ, పెండింగ్లో ఉన్న డి ఏ లని విడుదల చేయాలని కోరారు. ఇంకా అనేక డిమాండ్స్ తో సమ్మె కొనసాగుతుందని ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి సమ్మె జయప్రదం కోసం ప్రతి కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొని కార్మిక, ఉద్యోగ, రైతు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై ఉద్యమ తీవ్రతను తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటియుసి, సిఐటియు, యువజన , విద్యార్థి సంఘాల మండల నాయకులు యూసుఫ్, పాండు, వీరాంజి, రాజశేఖర్, నాగేంద్ర, దస్తగిరి,కృష్ణ, భాస్కర్, నరేష్, రాముడు, భాష తదితరులు పాల్గొన్నారు.


