షాపు పునరుద్ధరణకు రూ.50 వేల చొప్పున డిమాండ్ చేశారని వెల్లడి
డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు పెడతామని బెదిరించారని ఆరోపణ
అధికారి తీరుపై చట్టపరంగా ఫిర్యాదు చేస్తానన్న నిర్వాహకుడు
- వ్యాపారంలో నష్టాలతో లైసెన్స్ కొనసాగించడం భారంగా మారిందని వెల్లడి
- కార్యాలయంలో తనను దూషించారని ఆరోపణ
- షాపునకు సరకు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు
- ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరిన నిర్వాహకుడు
హలహర్వి, సెప్టెంబరు 17 (స్ఫూర్తి పత్రిక):
గుళ్యం గ్రామానికి చెందిన వైన్‌షాపు నిర్వాహకుడు ఏ. శ్రీధర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబుపై పలు ఆరోపణలు చేశారు. లంచం డిమాండ్ చేయడంతో పాటు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.గుళ్యం సరిహద్దు ప్రాంతంలోని 84వ నంబరు వైన్‌షాపు లైసెన్స్ హోల్డర్‌గా ఉన్న తన షాపు రెండేళ్ల కాలపరిమితి పూర్తికావడంతో పునరుద్ధరణ ప్రక్రియకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఒక్కో షాపునకు రూ.50 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారని శ్రీధర్ ఆరోపించారు. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని, త్రైమాసిక లైసెన్స్ ఫీజు చెల్లించడం కూడా భారంగా మారిందని, షాపు నిర్వహించడం తనకు కష్టంగా ఉందని చెప్పగా అందరి ఎదుట అవమానించి బయటకు పంపించారని వాపోయారు.గతంలో ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కూడా సుమారు గంటపాటు తనను తీవ్ర పదజాలంతో దూషించారని శ్రీధర్ తెలిపారు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారం సాగనివ్వనని, కేసులు పెట్టి వేధిస్తానని బెదిరించినట్లు ఆయన ఆరోపించారు.సరిహద్దు ప్రాంతంలో ఉన్న తమ షాపునకు సకాలంలో సరకు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా పేర్కొన్నారు. అధికారి వ్యవహారశైలిపై, లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై చట్టపరంగా ఫిర్యాదు చేయనున్నట్లు శ్రీధర్ తెలిపారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ఆయన కోరారు.