– యాదగిరిగుట్టలో తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం
– సమాజ గౌరవాన్ని కాపాడాలంటే ఐక్యత అవసరం అని పిలుపు
– కొత్త తరం భవిష్యత్తు కోసం సంఘం బలపడాలని సూచన
– పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంఘ నాయకులు, సభ్యులు
యాదగిరిగుట్ట, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక):
యాదగిరిగుట్టలోని రెడ్డి సంక్షేమ సంఘం ఫంక్షన్ హాల్లో తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త మరియు కవయిత్రి మంజుల పత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరణం సమాజానికి గొప్ప చరిత్ర ఉందని, ఒకప్పుడు గ్రామాల్లో ప్రజలకు న్యాయం చెప్పిన వర్గంగా కరణాలు నిలిచారని పేర్కొన్నారు. గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించిన ఈ సమాజం గతంలో విశేష గౌరవం పొందిందని గుర్తుచేశారు.కాలక్రమేణా సమాజంలో ఐక్యత తగ్గిపోవడం వల్ల కరణం సమాజ ప్రభావం తగ్గిపోయిందని ఆమె అన్నారు. ఒకప్పుడు సమాజం పులిలా బలంగా నిలిచిందని, కానీ ప్రస్తుతం ఐక్యత లేకపోవడం వల్ల ఆ స్థాయి తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. మన మధ్య విభేదాలు పెరగడం సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు.ఒకరి బాధ అందరి బాధగా భావించాలి. ఒకరి విజయం అందరి విజయంగా భావించినప్పుడు మాత్రమే సమాజం ముందుకు సాగుతుంది” అని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే భవిష్యత్ తరాలకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.ఈ సమావేశం కేవలం ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆమె సూచించారు. సమాజం ఐక్యంగా ఉంటే చరిత్ర మళ్లీ ప్రకాశిస్తుందని, ఐక్యతే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి అని అన్నారు.మహిళల పాత్ర కూడా సమాజ నిర్మాణంలో కీలకమని ఆమె పేర్కొన్నారు. కుటుంబాన్ని నిలబెట్టే మహిళలే సమాజాన్ని బలపరచగలరని అన్నారు. అందువల్ల సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు కృషి చేసిన తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండారు రాంప్రసాద్ రావును ఆమె అభినందించారు. ఆయన నాయకత్వంలో సమాజం మరింత బలపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చకిలం అనిల్ కుమార్, చందుపట్ల వెంకటేశ్వర రావు, కరణం నాయకులు మరియు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

