- అక్రమ పార్కింగ్, రహదారి ఆక్రమణలపై కఠిన చర్యలు
- రద్దీ ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు
కర్నూలు, మార్చి 23 (స్ఫూర్తి పత్రిక):
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కర్నూలు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ పర్యవేక్షణలో ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు, మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రహదారులను ఆక్రమించి నిలిపిన తోపుడు బండ్లు, అనధికార పార్కింగ్ వాహనాలు మరియు ఇతర అడ్డంకులను తొలగించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో వాహనదారులు, వ్యాపారులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రహదారులపై వాహనాలను అడ్డంగా నిలపకుండా ఉండాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

