- గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణతో శక్తి ప్రదర్శన
- కేంద్ర పథకాలే అభివృద్ధికి కారణమని బీజేపీ వ్యాఖ్యలు
- రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమనే ధీమా
ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక):
ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమంతో బీజేపీ శ్రేణులు కాషాయ జోష్‌ను ప్రదర్శిస్తూ గ్రామాల్లో తన బలం చాటుకున్నాయి. ఆలూరు, హాలహర్వి, పచ్చరపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనగా, గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపు వచ్చినట్లు కనిపించింది. ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణతో పాటు ప్రజలతో మమేకమవుతూ పార్టీ సిద్ధాంతాలను వివరించే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామాల్లో కనిపిస్తున్న సి.సి. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ప్రధానంగా కేంద్రం అందించిన నిధులతోనే జరిగాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక పనులు జరిగాయని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వాస్తవాలను ప్రజలు గుర్తిస్తున్నారని, వాటిపై స్పష్టమైన అవగాహన పెరుగుతోందని అన్నారు.రాబోయే ఎన్నికలపై మాట్లాడిన ఆయన, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయం ఖాయమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూటమి బలంగా నిలబడుతుందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయిలో కూడా కూటమి ఆధిపత్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభంజనం కనిపించబోతుందని ధీమా వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తూ, అభివృద్ధి పనులను చూసి తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో తమ తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు.కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవరాజు, మండల కన్వీనర్ బసవరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.