– దేవనకొండ పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం
– 14–15 ఏళ్ల బాలికలకు ఉచిత టీకా అందజేత
– తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి
– క్యాన్సర్ నివారణకు కీలక అడుగు: వైద్యులు
దేవనకొండ, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక):
దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సంచార చికిత్స జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఆయన బాలికల ఆరోగ్య రక్షణకు ఈ టీకా ఎంతో ముఖ్యమని వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలలో భాగంగా హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ఉచితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టీకా ప్రధానంగా 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
బాలికలకు టీకా ఇవ్వడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి తప్పనిసరిగా తీసుకుంటామని తెలిపారు. అలాగే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాలికలకు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే టీకా ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు.
టీకా తీసుకున్న అనంతరం కనీసం 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలోనే ఉండాలని సూచించారు. టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, ఎర్రదనం, స్వల్ప జ్వరం, తలనొప్పి, అలసట వంటి తేలికపాటి దుష్ప్రభావాలు కనిపించే అవకాశముందని, ఇవి సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతాయని తెలిపారు.
భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించడంలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. బాలికల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు విజయభాస్కర్, కళ్యాణ్, సామాజిక ఆరోగ్య అధికారులు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, వైద్య సిబ్బంది, ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

