– వ్యర్థాలు పేరుకుపోయి నిల్వ నీరు
– 15 రోజులుగా పరిష్కారం కాని సమస్య
– అంటు వ్యాధుల భయంతో కాలనీ ప్రజల వాపోరు
దేవనకొండ, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక):
మండల కేంద్రంలోని మాలవీధి సమీపంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి నిల్వ నీరు ఉండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. స్థానికంగా జెడ్పీటీసీ ఇంటి వెనుక భాగంలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని వారు పేర్కొన్నారు.
సుమారు పదిహేను రోజులుగా చెత్త తొలగింపు సక్రమంగా జరగకపోవడంతో అక్కడ మురికి నీరు నిల్వ ఉండి అసహ్యకర పరిస్థితులు నెలకొన్నాయని కాలనీ వాసులు తెలిపారు. దీంతో దోమలు, పందులు తిరుగుతూ పరిసర ప్రాంతాల్లో మురికి మరింతగా వ్యాపిస్తున్నదని వారు వాపోతున్నారు.
పంచాయతీ సిబ్బంది కొన్నిసార్లు వచ్చి చెత్తను కొంత మేర తొలగించినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదని స్థానికులు పేర్కొన్నారు. మరుసటి రోజే మళ్లీ చెత్త పేరుకుపోతుందని తెలిపారు.
పొడి చెత్త, తడి చెత్త వేర్వేరుగా వేయడానికి టబ్బులు అందిస్తే సమస్య కొంతవరకు తగ్గుతుందని కాలనీ వాసులు సూచిస్తున్నారు. అలాగే శాశ్వత పరిష్కారంగా చెత్త సేకరణకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ఈ సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్త తొలగింపు, మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెత్తను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.