sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 8:33 am Digital Edition : SPHOORTI PATRIKA

దేవనకొండ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు సీపీఐ వినతి

  • దేవనకొండ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి
    జిల్లా కలెక్టర్‌కు సీపీఐ వినతిపత్రం
    డీఎన్‌టీఎ హాస్టల్ పునఃప్రారంభానికి విజ్ఞప్తి
    పీహెచ్‌సీలో ఖాళీ పోస్టుల భర్తీకి డిమాండ్
    మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాలకు సీసీ రహదారి ఏర్పాటు చేయాలి
    హంద్రీ-నీవా సబ్ కెనాల్ ద్వారా చెరువులకు నీరు అందించాలని విజ్ఞప్తి

దేవనకొండ, జూన్ 17 (స్ఫూర్తి పత్రిక):

దేవనకొండ మండల ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని సీపీఐ మండల కార్యదర్శి ఎం. నరసారావు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరిని కోరారు. బుధవారం దేవనకొండ మండల పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్‌కు సీపీఐ పార్టీ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో గతంలో పనిచేసిన డీఎన్‌టీఎ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) హాస్టల్‌ను వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా మండలంలో ఒక మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, రెగ్యులర్ ఫార్మసిస్ట్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అవసరమైన సిబ్బంది లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మెరుగైన వైద్య సేవల కోసం ఖాళీలను భర్తీ చేయడం అత్యవసరమని తెలిపారు.

అలాగే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి సీసీ రహదారి నిర్మించాలని, వర్షాకాలంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ, గుండ్లకొండ సమీపంలోని హంద్రీ-నీవా ప్రధాన కాలువకు సబ్ కెనాల్ ఏర్పాటు చేసి గుండ్లకొండ, గుడిమిరాళ్ల, చెల్లెలచలిమల, పి.కోటకొండ మీదుగా మాచాపురం చెరువుకు నీరు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాజెక్టు అమలైతే పలు గ్రామాల రైతులకు సాగునీరు అందడమే కాకుండా తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందని వివరించారు.

మండల అభివృద్ధికి సంబంధించిన ఈ సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్‌ను కలిసిన వారిలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుడు ఖండప్ప, సీపీఐ మండల నాయకులు రవి, భాస్కర్, నరేష్, మద్దిలేటి, రాజశేఖర్, హరి, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.