– ఆదివారం సందర్భంగా ఘనంగా అభిషేకాలు, అర్చనలు
– ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు
– ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం
– భక్తులకు అన్నదాన కార్యక్రమం
హోళగుంద, మార్చి 15 (స్ఫూర్తి పత్రిక):
హోళగుంద మండల పరిధిలో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు గిరి స్వామి, మనోహర్ స్వామిలు మాళ మల్లేశ్వర స్వామివారికి సంప్రదాయ పద్ధతిలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బిల్వార్చన, బండారు అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, ఆకు పూజలు నిర్వహించి భక్తుల కోరికలు తీర్చాలని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. స్వామివారి నామస్మరణతో ఆలయం మారుమోగింది. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేయించారు.
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున దేవరగట్టు చేరుకుని మాళ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి కృపతో కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థనలు చేశారు.
ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు భోజన సౌకర్యం కల్పించి సేవలు అందించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని అభినందించారు.
ప్రతి ఆదివారం దేవరగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆలయానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు