sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 7:22 am Digital Edition : SPHOORTI PATRIKA

నల్లచెలిమిలలో రాష్ట్రీయ గోకుల మిషన్ కార్యక్రమం విజయవంతం

  • పశుసంవర్ధనపై రైతుల్లో పెరిగిన అవగాహన
  • పాడి పశువుల అభివృద్ధికి గోకుల మిషన్ కీలక పాత్ర
  • నిపుణుల సూచనలతో శాస్త్రీయ పద్ధతుల్లో పశుపోషణ
  • గ్రామీణ రైతులకు లబ్ధిచేకూర్చిన అవగాహన కార్యక్రమం

దేవనకొండ , ఫిబ్రవరి 3 (స్ఫూర్తి పత్రిక):
దేవనకొండ మండలం నల్లచెలిమిల గ్రామంలో రాష్ట్రీయ గోకుల మిషన్ కార్యక్రమంలో భాగంగా లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించారు. పాడి పశువుల అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, త్వరితగతిన పాడి పశువుల అభివృద్ధి సాధించాలంటే లింగ నిర్ధారిత వీర్యం ద్వారా చూడి కట్టించుకోవడం అత్యంత ప్రయోజనకరమని తెలిపారు. ఈ విధానం ద్వారా మేలు జాతి ఆడదూడలను పొందవచ్చని, తద్వారా పాడి ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు.పశుగణాభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు డాక్టర్ బి. మల్లన్న, గోనెగండ్ల ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పశువు ఈనిన తర్వాత మూడు నెలల వ్యవధిలో తిరిగి చూడి కట్టించుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధ్యమవుతాయని రైతులకు సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పశుపోషణ చేపడితే ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయని తెలిపారు.లేగ దూడల ప్రదర్శన కార్యక్రమంలో మొత్తం 69 లేగ దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించారు. అలాగే మేలు జాతి దూడలను పెంచుతున్న రైతులకు ప్రోత్సాహకంగా బహుమతులు, విటమిన్ టానిక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రైతుల్లో పశుపోషణపై మరింత ఆసక్తిని పెంచిందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌తో పాటు వెలమకూరు పశు వైద్యాధికారి డాక్టర్ కె. అనీల, వీఏ హనుమన్న, పశు వైద్య సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతాయని రైతులు అభిప్రాయపడ్డారు.