- వెల్ఫేర్ బోర్డులు పటిష్టం చేయాలని డిమాండ్
- పెండింగ్ 46 వేల క్లెయిములు వెంటనే పరిష్కరించాలి
- సెస్సు 2%కి పెంపు – నేరుగా బోర్డు ఖాతాకు జమ చేయాలి
దేవనకొండ, ఫిబ్రవరి 23 (స్ఫూర్తి పత్రిక):
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23న నిర్వహించిన నిరసన దినంలో భాగంగా దేవనకొండలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ ఆమోదించిన 1996 భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అమలులో రాష్ట్రాల మధ్య ఏకరీతి లేకపోవడం పట్ల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐటీయూసీ మండల నాయకులు వై. శేఖర్, వీరస్వామి మాట్లాడుతూ, చట్టం అమల్లోకి వచ్చి మూడు దశాబ్దాలు గడిచినా పలు రాష్ట్రాల్లో వెల్ఫేర్ బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వసూలు చేస్తున్న వెల్ఫేర్ సెస్సును ఇతర పథకాలకు మళ్లించడం సరైంది కాదని, దానిని నేరుగా వెల్ఫేర్ బోర్డు ఖాతాకు జమ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లెయిములను తక్షణమే పరిష్కరించి, లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రమాద మృతుల కుటుంబాలకు వెల్ఫేర్ బోర్డు ద్వారా అందించే ఆర్థికసాయం పథకాన్ని పునరుద్ధరించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పూర్వం అమల్లో ఉన్న ఈ పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, 50 సంవత్సరాలు నిండిన మరియు వృద్ధాప్యం కారణంగా పనికి అనర్హులైన నిర్మాణ కార్మికులకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని, వారి కుటుంబాల్లోని పిల్లలకు ఉన్నత విద్య, విదేశీ విద్య, నైపుణ్య శిక్షణ కోసం ఆర్థిక సహాయం మరియు రుణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కృష్ణ, రామాంజి, మద్దిలేటి, శ్రీనివాసులు, నారాయణ, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.