sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 1:58 am Digital Edition : SPHOORTI PATRIKA

పదో తరగతి పరీక్షలకు శ్రీకారం… ప్రశాంతంగా మొదటి రోజు

– మండలంలో మూడు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
– 666 మందిలో 656 మంది హాజరు
– 10 మంది విద్యార్థులు గైర్హాజరు

హోళగుంద, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక):

మండల పరిధిలో పదో తరగతి వార్షిక పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలి రోజు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడింది. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలకు సిద్ధమయ్యారు.

పరీక్షా నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవడంతో పాటు పరీక్షా హాళ్లలో క్రమబద్ధంగా కూర్చుని పరీక్షలు రాశారు. పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద తల్లిదండ్రుల రద్దీ కనిపించింది.

మండల కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాలలో సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, కన్నడ, ఉర్దూ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 666 మంది విద్యార్థులకు గాను 656 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు.

పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు కేంద్రాల వద్దకు రాకుండా పర్యవేక్షణ కొనసాగించారు.

విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, కూర్చునే ఏర్పాట్లు వంటి సదుపాయాలను కల్పించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా పరీక్షా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వెల్లడించారు.

మొదటి రోజు పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగాయని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.