sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 1:39 am Digital Edition : SPHOORTI PATRIKA

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

– జిల్లా వ్యాప్తంగా పరీక్షల కోసం భద్రతా చర్యలు
– కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు
– 144 సెక్షన్ అమలు, ప్రశ్నపత్రాల రవాణాకు ప్రత్యేక భద్రత

కర్నూలు, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక):

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

జిల్లాలోని వివిధ పరీక్ష కేంద్రాలను డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పరిశీలించారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, సిబ్బంది పరీక్షా నిబంధనలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అదేవిధంగా ప్రశ్నపత్రాల రవాణా సమయంలో భద్రత కోసం ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో గుంపులు గుంపులుగా ఎవరూ చేరకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.