sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 3:32 pm Digital Edition : SPHOORTI PATRIKA

పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సభ

– ఎఫ్‌ఆర్ హై స్కూల్లో నిర్వహణ
– పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని సూచనలు
– విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య కీలకం అన్న నిర్వాహకులు
– ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఉపాధ్యాయుల ఆకాంక్ష

దేవనకొండ, మార్చి 13 (స్ఫూర్తి పత్రిక):

దేవనకొండ మండల కేంద్రంలోని ఎఫ్‌ఆర్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయుడు బి. ఉచ్చీరప్ప అధ్యక్షత వహించారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రంగస్వామి, వీరేంద్రనాథ్ పటేల్ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు. పరీక్షల పట్ల నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా కృషి చేసి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని, పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నందున ఎటువంటి అక్రమాలకు అవకాశం ఉండదని, కాబట్టి విద్యార్థులు క్రమపద్ధతిలో చదివి తమ ప్రతిభను చూపించాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి. రఘునాథ్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శాంతి కుమార్, ఉపాధ్యాయులు గోపాల్, షబానా, శ్రావణి, సువర్ణ, లక్ష్మి, స్రవంతి, రవీంద్రనాథ్ రెడ్డి, రంగస్వామి, ఎస్‌ఎండి భాష, హేమలత తదితరులు పాల్గొన్నారు.