-
ఉపాధి హామీ చట్టంలో మార్పులతో పేదల జీవనాధారంపై ముప్పు
-
పని అడిగే హక్కు, వేతన హక్కును కోల్పోయే ప్రమాదం
-
200 రోజులు పని – రూ.600 వేతనం కల్పించాలి
-
దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలకు పిలుపు
-
అంబేద్కర్ విగ్రహం ముందు ఉపాధి హామీ రక్షణ ప్రతిజ్ఞ
గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలు పేద ప్రజల హక్కులపై నేరుగా దాడి చేస్తున్నట్లేనని, దీనిని రాజ్యాంగ స్ఫూర్తితో అడ్డుకుంటామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. వీరశేఖర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీని కాపాడుకునేందుకు విస్తృత స్థాయి పోరాటాలు చేపడతామని ఆయన వెల్లడించారు.
సోమవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు సంఘం కార్యకర్తలు “ఉపాధి హామీని కాపాడుకుంటాం” అంటూ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మండల సీనియర్ నాయకులు యూసుఫ్ భాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరశేఖర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఏళ్ల తరబడి జరిగిన ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణల ద్వారా బలహీనపరుస్తోందని విమర్శించారు.
పని పొందే హక్కు, పనికి తగిన వేతనం పొందే హక్కును కోల్పోయే ప్రమాదం నెలకొందని, పని అడిగే హక్కును కూడా చట్టంలో మార్పులు చేసి హరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు పేదలపై దాడి చేస్తూ మరోవైపు పేదలకు మేలు చేస్తున్నామంటూ అబద్ధ ప్రచారం చేస్తున్న ప్రభుత్వాల బూటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రజల హక్కుగా భావిస్తూ సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని, సంవత్సరానికి 200 రోజులు పని, రోజుకు రూ.600 వేతనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇతర ప్రజా సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని, వీటిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం కార్యకర్తలు మరియు ప్రజా సంఘాల నాయకులు అశోక్, మహేంద్ర, రాముడు, రంగడు, మహేష్, బలరాముడు, రంగన్న, చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.