– జిల్లా పోలీసు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు
– ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన త్యాగం చిరస్మరణీయం
– సేవా భావానికి ఆయన జీవితం ప్రేరణ అని పోలీసులు
కర్నూలు, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక):
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పోలీసులు నివాళులు అర్పించారు.
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ పాల్గొని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆయన పట్టుదల, త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
దేశ చరిత్రలో పొట్టి శ్రీరాములకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన జీవితం సమాజ సేవకు అంకితభావంతో పనిచేయడానికి అందరికీ ప్రేరణనిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ జావేద్, ఆర్ఎస్ఐలు, ఏఆర్, డీసీఆర్బీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

