– ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 102 వినతులు స్వీకరణ
– బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ
– త్వరితగతిన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం
కర్నూలు, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక):
జిల్లా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమానికి మొత్తం 102 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులకు వెంటనే విచారణ చేపట్టి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
ఫిర్యాదుల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన, భూమి ఆక్రమణ వివాదాలు, ప్లాట్ రిజిస్ట్రేషన్ సమస్యలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, ఇల్లు నిర్మాణం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులు వంటి పలు అంశాలు ఉన్నాయి.
కర్నూలు శ్రీరామ్ నగర్‌కు చెందిన నాగమణి అనే మహిళ తన కుమారునికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
గోవర్ధనగిరి మండలానికి చెందిన మద్దిలేటి 10 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ప్రభుత్వ భూమిలో నాటిన మొక్కలను కొందరు తొలగించారని ఫిర్యాదు చేశారు. విఠల్ నగర్‌కు చెందిన మహమ్మద్ గౌస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు తీసుకున్నారని వినతి ఇచ్చారు.
గొందిపర్ల గ్రామానికి చెందిన సునీల్ కుమార్ ఫైనాన్స్ సంస్థకు ఈఎంఐలు చెల్లించినప్పటికీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రుక్మిణి నగర్‌కు చెందిన సరస్వతి ఇల్లు నిర్మాణం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని పేర్కొన్నారు.
దేవమడ గ్రామానికి చెందిన పెద్ద ఎల్లనాయుడు కారు కొనుగోలు విషయంలో మోసం జరిగిందని ఫిర్యాదు చేశారు. కారు అమ్మిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయకుండా జీపీఎస్ ద్వారా వాహనాన్ని తిరిగి తీసుకెళ్లారని తెలిపారు.
అలాగే మామిదలపాడు గ్రామానికి సంబంధించిన భూమి వివాదంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొందరు ఆక్రమణకు పాల్పడుతున్నారని మరో ఫిర్యాదు అందింది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.