- ప్రజా ఫిర్యాదుల వేదికకు 85 వినతులు
- ఉద్యోగ మోసాలు, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు ప్రధాన ఫిర్యాదులు
కర్నూలు, మార్చి 23 (స్ఫూర్తి పత్రిక):
జిల్లాలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 85 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సంబంధిత పోలీసు అధికారులను వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చిన ఫిర్యాదుల్లో ఉద్యోగాల పేరుతో మోసాలు, భూమి, ఆస్తి వివాదాలు, ఆర్థిక మోసాలు ఎక్కువగా నమోదైనట్లు వెల్లడైంది. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటనలపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.
అలాగే పెట్టుబడుల పేరుతో మోసాలు, బంగారం తాకట్టు సమస్యలు, ప్లాట్లపై డబుల్ రిజిస్ట్రేషన్లు, కుటుంబ ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా అధికంగా ఉన్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు, ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి పథకాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్లాలని హెచ్చరించారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంగా తీసుకుని న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సిఐలు శివశంకర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

