– హొళగుందలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
– బాల్యంలో పెళ్లిళ్లు ఆపాలని అధికారుల పిలుపు
– మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం
– ఆటల పోటీలతో మహిళల్లో ఉత్సాహం
హొళగుంద, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక):
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హొళగుంద మండలంలో ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన మరియు సమానత్వంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో విజయలలిత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ సమాజంలో పూర్తి స్థాయి సమానత్వం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. జెండర్ అసమానతలు తగ్గాలంటే కుటుంబ స్థాయిలోనే సమానత్వం గురించి అవగాహన పెరగాలని పేర్కొన్నారు. ఇంట్లో ఆడ, మగ పిల్లలందరికీ సమానంగా విద్యతో పాటు ఇంటి పనులపై అవగాహన ఉండాలని ఆమె సూచించారు.మండల విద్యాశాఖ అధికారి సుధారాణి మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.ఐసీడీఎస్ సూపర్వైజర్ శిబారాణి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలను అమలు చేస్తోందన్నారు. వరకట్నం నిషేధ చట్టం, గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిర్మూలన చట్టం, పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం, పోక్సో చట్టం వంటి చట్టాల గురించి మహిళలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో పనిచేస్తున్న వివిధ శాఖల మహిళల కోసం ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ మండల కో-ఆర్డినేటర్ సేవా నాయక్, ఉపాధ్యాయులు, ఐకెపి సిబ్బంది రాధమ్మ, మహిళా సంఘాల సభ్యులు, ఫౌండేషన్ క్లస్టర్ ఆర్గనైజర్ మల్లేశ్వరి, మౌలా సాబ్, విజయ్, శేఖన్నా, భారతి మరియు మండలంలోని మహిళలు పాల్గొన్నారు.

