sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 12:47 pm Digital Edition : SPHOORTI PATRIKA

బీసీల హక్కుల సాధనకే పోరాటం… ప్రభుత్వానికి బీసీవై పార్టీ గడువు

  • ఐదు డిమాండ్లపై తక్షణ చర్యల డిమాండ్
  • మార్చి 31లోగా స్పందించకపోతే నిరాహార దీక్ష హెచ్చరిక

హోళగుంద, మార్చి 23 (స్ఫూర్తి పత్రిక):

వెనుకబడిన తరగతుల హక్కుల సాధన లక్ష్యంగా బీసీవై పార్టీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి సంబంధించిన ప్రధాన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అర్జున్ వాల్మీకి ఆధ్వర్యంలో నాయకులు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలు గత ఎన్నో దశాబ్దాలుగా వివక్షను ఎదుర్కొంటున్నారని, వారి అభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం పార్టీ రూపొందించిన ఐదు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినట్లు తెలిపారు.

బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయడం, అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు భూమి కేటాయింపు, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుల గణన నిర్వహణ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 44 శాతం రిజర్వేషన్లు కల్పించడం, బీసీ కార్పొరేషన్లకు పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయడం వంటి అంశాలను తక్షణమే అమలు చేయాలని పార్టీ డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి మార్చి 31 వరకు గడువు విధించినట్లు తెలిపారు. ఆలోపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత మార్గంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు.

జిల్లా యంత్రాంగం తమ వినతిపత్రాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, బీసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.