sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 2:40 pm Digital Edition : SPHOORTI PATRIKA

మహిళ మారితే కుటుంబం మారుతుంది… సమాజం మారుతుంది

మహిళా దినోత్సవం సందర్భంగా కవయిత్రి మంజుల పత్తిపాటి ఆవేదన
సాటి మహిళ మారితేనే నిజమైన మహిళా సాధికారత
మహిళలకు మహిళలే అడ్డంకిగా మారుతున్న పరిస్థితులపై వ్యాఖ్య

ఆలేరు, మార్చి 08 (స్ఫూర్తి పత్రిక):

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కవయిత్రి మంజుల పత్తిపాటి మహిళల పరిస్థితిపై స్పందించారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నప్పటికీ ప్రతి మహిళ నిజంగా సంతోషంగా ఉందా అనే విషయాన్ని సమాజం ఆలోచించాలని ఆమె పేర్కొన్నారు.

చాలా సందర్భాల్లో మహిళలకు మహిళలే శత్రువులుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు. తాము జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను మరొక మహిళపై మోపే పరిస్థితులు సమాజంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటికి సంతోషంగా అడుగుపెట్టిన కోడలిని వరకట్న వేధింపులతో బాధపెట్టే సంఘటనలు ఇప్పటికీ చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. గ్యాస్ సౌకర్యాలు ఉన్న రోజుల్లో కూడా కట్టెల పొయ్యిపై వంట చేసిన మహిళలు ఉన్నారని, కుటుంబ సభ్యుల సేవలో జీవితాన్ని అర్పించిన మహిళల కథలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.

నిండు గర్భిణీ అయినప్పటికీ నీళ్ల బిందెలు మోసిన మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. అలాంటి కష్టాలు పోవాలంటే కేవలం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సరిపోదని, ముందుగా మన ఆలోచనల్లో మార్పు రావాలని సూచించారు.

తన జీవితంలో ఎదురైన బాధలు, కన్నీళ్లు తనలో ఒక విప్లవాన్ని మేల్కొలిపాయని ఆమె తెలిపారు. ఆ అనుభవాలు కవితల రూపంలో వెలువడుతున్నాయని పేర్కొన్నారు.

మహిళలకు పురుషులే శత్రువులు కాదని, చాలాసార్లు మనకు మనమే శత్రువులమైపోతున్నామని ఆమె వ్యాఖ్యానించారు. పిల్లలను సరైన విలువలతో పెంచకపోతే సమాజంలో సమస్యలు పెరుగుతాయని చెప్పారు.

మహిళ మారితే కుటుంబం మారుతుందని, కుటుంబం మారితే సమాజం మారుతుందని ఆమె పేర్కొన్నారు. అప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి రోజూ మహిళా దినోత్సవం జరుపుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.