📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్మిగులు భూములపై ప్రభుత్వ ముందడుగు

మిగులు భూములపై ప్రభుత్వ ముందడుగు

📰 Generate e-Paper Clip

రెవెన్యూ స్పెషల్ డ్రైవ్‌తో భూ సమస్యలకు పరిష్కారం

– రెవెన్యూ డ్రైవ్‌తో అర్హులకు న్యాయం

– భూముల హక్కుల కల్పన
– పూర్తిగా డిజిటల్ విధానంలో

దేవనకొండ, జనవరి 24 , (స్ఫూర్తి పత్రిక ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా దేవనకొండ మండలంలోని ఎనిమిది రెవెన్యూ గ్రామాలలో ఉన్న( ఇతరములు మరియు మిగులు భూముల) సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు దేవనకొండ తహసీల్దార్ ఎం. సుదర్శనం విలేకరుల సమవేశం లో తెలిపారు.దేవనకొండ మండల పరిధిలోని తెర్నేకల్లు, పి.కోటకొండ, చెల్లెలి చెలిమెల, కుంకనూరు, దేవనకొండ, వెలమకూరు, నల్లచెలిమల, గుండ్లకొండ రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ రికార్డుల సమగ్ర పరిశీలన అనంతరం మొత్తం 400 సర్వే నెంబర్లలో 1,275.11 ఎకరాల భూమి (ఇతరములు మరియు మిగులు భూములుగా) గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఈ భూములు గత కొన్ని సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉండటంతో పాటు, అనేక మంది అర్హులైన రైతులు భూముల హక్కుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ స్పెషల్ డ్రైవ్‌ను అమలులోకి తీసుకువచ్చిందని, దీని ద్వారా భూముల సమస్యలకు చట్టబద్ధమైన, పారదర్శకమైన పరిష్కారం అందించడమే ప్రధాన లక్ష్యమని తహసీల్దార్ ఎం. సుదర్శనం స్పష్టం చేశారు. ఈ డ్రైవ్ కింద అర్హత కలిగిన రైతులు తప్పనిసరిగా జనవరి 31వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.రైతులు సమర్పించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో చట్టపరంగా పరిశీలించి, అర్హతలు నిర్ధారించిన అనంతరం సంబంధిత భూములను ఆన్‌లైన్ విధానంలో రైతుల పేర్లపై అధికారికంగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో, పారదర్శకంగా నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.సంబంధిత ఎనిమిది రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు తమ గ్రామాల వీఆర్వోలను సంప్రదించి దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని, వీఆర్వో స్థాయి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు అన్ని చర్యలు ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారానే పూర్తవుతాయని తెలిపారు. రైతులు ఎవరూ మధ్యవర్తులు, దళారుల మాటలకు లోనుకాకుండా నేరుగా ప్రభుత్వ కార్యాలయాలను మాత్రమే సంప్రదించాలని, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ వల్ల భూములపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని తహసీల్దార్ తెలిపారు. ముఖ్యంగా భూముల హక్కుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అర్హులైన రైతులకు ఈ కార్యక్రమం ద్వారా న్యాయం చేకూరుతుందని, భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సర్వే డీటీ అమీన, వీఆర్వోలు రాజన్న, సలోమి, కౌలుట్ల, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్‌తో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!