sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 6:15 am Digital Edition : SPHOORTI PATRIKA

యాక్సిడెంట్ నాటకం.. ఆటోలోకి ఎక్కించి HIV ఇంజెక్షన్ దాడి

ప్రియుడిని దక్కించుకునేందుకు హద్దులు దాటిన మహిళ

డాక్టర్ భార్యపై ప్రియురాలి పాశవిక దాడి

వివాహేతర సంబంధం ఒక మహిళ జీవితాన్ని నాశనం చేయబోయిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. వివాహిత డాక్టర్‌ను దక్కించుకునేందుకు అతడి భార్యను తొలగించాలన్న దురుద్దేశంతో ఓ మహిళ అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడింది. యాక్సిడెంట్ జరిగినట్టు నాటకం ఆడి, బాధితురాలిపై HIV ఇంజెక్షన్‌తో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం, కర్నూలుకు చెందిన ఓ వైద్యుడికి బీచుపల్లి బోయ వసుంధరతో గత కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల ఆ వైద్యుడికి వివాహం జరగడంతో, అతడు వసుంధరను దూరం పెట్టాడు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని వసుంధర, డాక్టర్ భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టిస్తే తనకు మార్గం సుగమమవుతుందన్న ఆలోచనతో ప్రమాదకరమైన పథకం రచించింది.

ఈ కుట్రలో ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన కొంగె జ్యోతి, భూమా జస్వంత్, భూమా శృతిని సహకారులుగా చేర్చుకుంది. జనవరి 9న వైద్యుడి భార్య స్కూటీపై వెళ్తుండగా లక్ష్మీనగర్ కేసీ కెనాల్ గట్టు వద్ద ఆమె వాహనాన్ని ఢీకొట్టి కిందపడేశారు. గాయపడిన మహిళకు సాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆటోలోకి ఎక్కించారు.

అప్పటికే ఆటోలో సిద్ధంగా ఉన్న వసుంధర, బాధితురాలిపై HIV ఇంజెక్షన్‌తో దాడి చేసింది. బాధిత మహిళ కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు తెలియజేయగా, ఆయన మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుల పాత్రను నిర్ధారించి వసుంధరతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన సమాజంలో పెరుగుతున్న వివాహేతర సంబంధాల వల్ల ఎలాంటి భయానక పరిణామాలు చోటుచేసుకోవచ్చో సూచిస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.