- సర్వేల్లో పారదర్శకత పెంచాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి
- నోటీసులు లేకుండా సర్వేలు వద్దు: అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు
- ప్రజాభిప్రాయం మెరుగుపడేలా రెవెన్యూ అధికారులు పనిచేయాలి
- నిబంధనల ఉల్లంఘనకు తావులేదు: పత్తికొండ సర్వే సమీక్షలో హెచ్చరిక
పత్తికొండ ,జనవరి 28 (స్ఫూర్తి పత్రిక):
రైతులకు ముందుగా నోటీసులు జారీ చేసిన తర్వాతనే సర్వేలకు వెళ్లాలని, తద్వారా పరిపాలనపై ప్రజల్లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఏర్పడేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు.
పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం పత్తికొండ టిటిడి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సర్వే సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.
సర్వేకు వెళ్లే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా సర్వే నోటీసులు అందించాలన్నారు. నిర్ణీత తేదీ, సమయానికే సర్వే చేపట్టాలని, సర్వే పూర్తయ్యాక రిపోర్టు ఇవ్వడంతో పాటు ఫోటోలు కూడా తీసుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ఎలాంటి డబ్బు వసూలు చేయకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్‌లో ఈ అంశంపై ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ, ఒకసారి నోటీసు ఇచ్చి సర్వేకు వెళ్లకపోతే రెండోసారి తప్పనిసరిగా నోటీసు జారీ చేసిన తరువాతే సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఇచ్చిన నోటీసులో పేర్కొన్న తేదీన ఖచ్చితంగా సర్వే నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్, తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్, పత్తికొండ రెవెన్యూ డివిజన్‌కు చెందిన సర్వేయర్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

