sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 11:30 am Digital Edition : Narasa Naidu

వాల్మీకి గుడి పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం

  • పంచాయతీ అధికారుల తక్షణ చర్య
  • అధికారులకు వాల్మీకి నాయకుల కృతజ్ఞతలు

దేవనకొండ, మార్చి 08 (స్ఫూర్తి పత్రిక):

దేవనకొండ మండల కేంద్రంలోని వాల్మీకి గుడి పరిసర ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను పంచాయతీ అధికారులు శుభ్రపరిచారు. గుడి చుట్టూ కొంతకాలంగా చెత్త పేరుకుపోవడంతో స్థానిక భక్తులు మరియు గ్రామస్థులకు అసౌకర్యం కలుగుతున్నట్లు వాల్మీకి నాయకులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయాన్ని పంచాయతీ సర్పంచ్ రంగలక్ష్మి మరియు పంచాయతీ కార్యదర్శి రాముడు వద్ద వాల్మీకి నాయకులు వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. వెంటనే పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేసి గుడి పరిసర ప్రాంతంలో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించి శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టించారు. దీంతో గుడి చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడింది.

స్థానిక ప్రజలు మరియు భక్తులు పంచాయతీ అధికారుల తక్షణ స్పందనను ప్రశంసించారు. వాల్మీకి నాయకులు మాట్లాడుతూ ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కారం చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు పంచాయతీ సర్పంచ్ రంగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రాముడు మరియు దేవనకొండ ఎంపీడీవోకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా గుడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు ఆర్‌ఎంపీ డాక్టర్ శేఖన్న, శ్రీనివాసులు, నరసనాయుడు, జనార్దన్ నాయుడు, కుక్కల వెంకటేష్, బాలమురళి, మధు తదితరులు పాల్గొన్నారు.