దేవనకొండ లో విద్యార్థి, యువజన సంఘాల నాయకుల డిమాండ్.
దేవనకొండ, ఫిబ్రవరి 4( స్ఫూర్తిపత్రిక ): అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని, యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని తిరుపతి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల నేతలను మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేసి దాడి చేయడం అమానుషమని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కె.భాస్కర్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు మహేంద్ర, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎం. రామాంజనేయులు లు తీవ్రంగా ఖండించారు. బుధవారం స్థానిక హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నందు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తిరుపతి జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీ లో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాలైన AISF,SFI ,NSUI సంఘాల నాయకులు యూనివర్సిటీ లో జరిగిన అవినీతిపై అవకతవకలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు అడ్డుకొని కొట్టి కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కిడ్నాప్ కి పాల్పడిన మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుండి 26 కోట్ల రూపాయలను అధికంగా ఫీజులు వసూలు చేశారని వారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేస్తూ అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను వెంటనే పేద విద్యార్థులకు చెల్లించాలని, విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా నిలిపివేయడంపై మోహన్ బాబు యూనివర్సిటీ పై 16 లక్షల జరిమానా విధించిందన్నారు. అయినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ ఆగలేదన్నారు. దీంతో విద్యార్థి సంఘాలైన AISF, SFI, NSUI సంఘాల నాయకులు తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారని కలెక్టర్ కార్యాలయం కూత వేటు దూరంలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకుడైన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ విద్యార్థి సంఘం నాయకులు వినోద్ లను నిర్బంధించి మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు, గుండాలు దాదాపుగా 40 మంది కార్లలో వచ్చి, ద్విచక్ర వాహనాన్ని పడదోచి వారిని కొట్టి కార్లో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేయడం జరిగిందన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్ల దురాగతాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో విద్యార్థి సంఘం నాయకులకు హాని కలిగితే మోహన్ బాబు యూనివర్సిటీ పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరు ఒకరు తిట్టుకుంటుంటే ప్రైవేట్ శక్తులు చట్టాన్ని అతిక్రమిస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నాయన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, కిడ్నాప్ లతో చట్టాన్ని అతిక్రమిస్తున్నాయన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యూనివర్సిటీలలో లోపాలను అక్రమాలను ఏమాత్రం పట్టించుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని చేతులతో పట్టుకొని తిరుగుతున్నారన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలపై నారా లోకేష్ గారికి తెలియజేసినప్పటికీ పట్టించుకో కపోవడం బాధాకరమన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీల వంటి ప్రైవేట్ యూనివర్సిటీల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ సంఘటనపై స్పందించాలన్నారు. ఫీజుల అక్రమాల దోపిడీని అరికట్టాలి, విద్యార్థి నేతలను కొట్టి కిడ్నాప్ చేసిన బౌన్సర్లను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల తరఫున పెద్ద ఎత్తున దశల వారీగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు నరేష్, మహేష్, చిన్నరాయుడు, రాము,రాముడు, నారాయణ, హరి, శివ తదితరులు పాల్గొన్నారు


