sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 2:53 pm Digital Edition : SPHOORTI PATRIKA

వివాహ వేడుకల్లో పాల్గొన్న సురేందర్ రెడ్డి… రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలపై చర్చ

– నూతన దంపతులకు శుభాకాంక్షలు
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నాయకులకు సూచనలు
– స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపు

ఆలూరు, మార్చి 08 (స్ఫూర్తి పత్రిక):

ఆలూరు నియోజకవర్గంలోని పలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాల్లో జరిగిన వివాహ కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలకు హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాహం అనేది రెండు హృదయాలను కలిపే పవిత్ర బంధమని పేర్కొన్నారు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న వధూవరులు పరస్పర గౌరవం, ప్రేమ, అనురాగంతో తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యుల ఆశీస్సులు, పెద్దల మార్గదర్శకంతో సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆయన అన్నారు.

వివాహ కార్యక్రమం అనంతరం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై త్వరలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలపై ఆయన చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలపరచి ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రజలతో సన్నిహితంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని అన్నారు.

ఆలూరు నియోజకవర్గంలో ఎవరు ఆహ్వానించినా వివిధ సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు సురేందర్ రెడ్డి హాజరవుతూ స్థానిక నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన హాజరుతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాలిగేర కేశం వెంకటరెడ్డి, బొబ్బిలి ప్రభాకర్ రెడ్డి, రామిరెడ్డి, ఎల్లార్తి అశోక్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, హెబ్బటం శ్రీనివాసరెడ్డి, ఇంగళ దహల్ సర్పంచ్ వెంకటరెడ్డి, మనేకుర్తి ప్రసాద్ రెడ్డి, ప్రహల్లాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు