- స్ఫూర్తి పత్రిక కథనానికి స్పందించిన యంత్రాంగం
- నిర్లక్ష్యానికి చెక్… స్ఫూర్తి పత్రిక ఎఫెక్ట్‌తో శుభ్రత చర్యలు
దేవనకొండ, జనవరి 29 (స్ఫూర్తి పత్రిక):
దేవనకొండ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం నిర్లక్ష్యానికి గురవుతున్న అంశంపై స్ఫూర్తి పత్రిక వెబ్ లో ప్రచురితమైన ”గేట్లు మూసి గాంధీజీని మరిచారా” కథనానికి యంత్రాంగం స్పందించింది. పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహం చుట్టూ పేరుకుపోయిన కలుపు, ముల్లకంపలు, చెత్తను తక్షణమే తొలగిస్తూ అధికారులు శుభ్రత పనులు చేపట్టారు.
స్ఫూర్తి పత్రిక వెబ్ లో వెలువడిన కథనం తరువాత స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. గాంధీజీ విగ్రహం చుట్టూ పెరిగిన ముల్లకంపలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు విగ్రహం కనిపించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఉన్న దయనీయ పరిస్థితి నుంచి విగ్రహం బయటపడింది.
ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ స్ఫూర్తి పత్రిక ప్రచురించిన వార్తకు ఇది ప్రత్యక్ష ఫలితమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జాతిపితకు జరిగిన అవమానాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన కథనం, అధికార యంత్రాంగాన్ని కదిలించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొంటున్నారు.
అయితే శాశ్వత పరిష్కారంగా గాంధీజీ విగ్రహం పరిరక్షణ బాధ్యతను సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం ఒకరోజు శుభ్రతతో సరిపెట్టకుండా, గాంధీజీ విగ్రహానికి తగిన గౌరవం ఎప్పటికీ నిలిచేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ప్రజలు కోరుకుంటున్నారు.

