హోళగుంద మండలంలో డీఎంహెచ్ఓ పర్యవేక్షణ
వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు
బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా అందిస్తున్న ప్రభుత్వం
గర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలక చర్య
హోళగుంద, మార్చి 11 (స్ఫూర్తి పత్రిక):
మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎల్. భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సత్యవతి మండల వైద్యాధికారులను ఆదేశించారు.
బుధవారం హోళగుంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మండల పరిధిలోని గజ్జహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశమై వ్యాక్సిన్ పంపిణీ విధానం, నమోదు ప్రక్రియ మరియు అవగాహన కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 సంవత్సరాలు పూర్తి చేసిన బాలికలకు హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ టీకా గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రధాన వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఒక్క డోసు వ్యాక్సిన్ అందించడం ద్వారా బాలికలకు దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి బాలికకు తప్పకుండా టీకా అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.
అనంతరం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై బాలికలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను తొలగిస్తూ ఆరోగ్య పరిరక్షణలో టీకా ఎంత ముఖ్యమో వివరించారు.
హోళగుంద, గజ్జహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇప్పటివరకు 32 మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అర్హులైన మరిన్ని బాలికలకు టీకాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హోళగుంద పీహెచ్సీ వైద్యురాలు బిందు మాధవి, గజ్జహళ్లి పీహెచ్సీ వైద్యుడు న్యూటన్, స్టాఫ్ నర్స్ రత్నమ్మ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

