– పరిహారం లేకుండా రైతుల భూములా?
– హంద్రీ నీవా పేరుతో రైతులకు అన్యాయం
– రైతుల హక్కులపై భూ కత్తి
– భూ సేకరణలో న్యాయం ఎక్కడ?
కర్నూల్ జిల్లా : దేవనకొండ మండలం లోని హంద్రీ నీవా కాలువకు సంబంధించి తెర్నేకల్, పాలకుర్తి రెవెన్యూ పరిధిలో భూ సేకరణ పేరుతో రైతుల భూములను పట్టాదారు పాస్ పుస్తకాల నుంచి తొలగిస్తున్నామన్న రెవెన్యూ అధికారుల నిర్ణయాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా భూములను రికార్డుల నుంచి తొలగించరాదని స్పష్టం చేసింది.ఈ మేరకు శనివారం దేవనకొండ తాసిల్దార్ ఏం.సుదర్శనంకు సిపిఎం జిల్లా నాయకుడు బి.వీరశేఖర్, మండల కమిటీ సభ్యులు అశోక్, యూసుఫ్ భాష, కె.పి.రాముడు వినతి పత్రం అందజేశారు. గతంలో ప్రజా ఫిర్యాదుల వేదికలో కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదు, దానిపై కలెక్టర్ చేసిన సిఫారసులను కూడా తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరివేముల నుంచి పాలకుర్తి–తెర్నేకల్ వైపు హంద్రీ నీవా కాలువ నిర్మాణానికి కొంతమంది రైతులు భూములు ఇచ్చినట్టు హంద్రీ నీవా, రెవెన్యూ శాఖ రికార్డుల్లో ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించకుండా రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల నుంచి భూములను తొలగిస్తున్నామన్న నిర్ణయం అన్యాయమని విమర్శించారు.రీ సర్వే సందర్భంగా రైతుల భూములు కాలువలోకి వెళ్లిపోయాయని చెబుతున్నారని, కానీ వాస్తవంగా ఇప్పటికీ రైతుల అనుభవంలో ఆ భూములు ఉన్నాయని వారు తెలిపారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు.ప్రభుత్వం వెంటనే రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే సంబంధిత భూములను రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలలో రీ షెడ్యూల్ చేసి నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఖాతాల్లో భూమి కొనసాగించాలని కోరారు.రైతులను పదేపదే వేధింపులకు గురి చేస్తే తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గుర్రాల వెంకట రాముడు, తిమ్మప్ప, ఆదోని చిట్టెన్న, డబ్బాల నరసింహులు, నామాల సత్తన్న తదితరులు పాల్గొన్నారు.

