నిరుద్యోగ రణభేరిని జయప్రదం చేయండి – ఏఐవైఎఫ్ పిలుపు
– చలో విజయవాడ పిలుపు
– యువత హక్కుల ఉద్యమం
– ఉద్యోగాల కోసం పోరాటం
– జాబ్ క్యాలెండర్ డిమాండ్
– నిరుద్యోగ యువత ఆందోళన
దేవనకొండ, జనవరి 24 , (స్ఫూర్తి పత్రిక ) : జనవరి 30న విజయవాడలో నిర్వహించనున్న “చలో విజయవాడ – నిరుద్యోగ రణభేరి” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు గౌడ్, సహాయ కార్యదర్శి రమేష్ యువతకు పిలుపునిచ్చారు.
శనివారం దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో నిరుద్యోగ రణభేరికి సంబంధించిన గోడ పత్రికను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, అసంతృప్తిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు.ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, జాబ్ గ్యారంటీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తీవ్రంగా విమర్శించారు.ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ పరిస్థితులకు నిరసనగా, నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం జనవరి 30న విజయవాడలో “నిరుద్యోగ రణభేరి చలో విజయవాడ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.“కొలువుల కోసం కొట్లాడుదాం రండి!” అనే నినాదంతో జనవరి 30న విజయవాడకు తరలిరావాలని యువతకు పిలుపునిచ్చారు. దేవనకొండ నుంచి అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతి, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కృష్ణ, రాజశేఖర్, రాజు, వీరాంజనేయులు, భాస్కర్, రంగడు, రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

