- లక్ష రూపాయల పశువుల మేత బూడిద
- మూడు రోజులు గడిచినా సంఘటన స్థలానికి రాని రెవెన్యూ అధికారులు
- దళిత రైతు జయన్నకు న్యాయం చేయాలని డిమాండ్
ఆలూరు, మార్చి 7 (స్ఫూర్తి పత్రిక):
ఆలూరు మండలంలోని మొళగవల్లి కొట్టాల గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో రైతు నిల్వ చేసుకున్న గడ్డివాము పూర్తిగా దగ్ధమై నష్టపోయినా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా బాధిత రైతును పరామర్శించడానికి ఒక్క రెవెన్యూ అధికారి కూడా వెళ్లలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామానికి చెందిన దళిత రైతు జయన్న తన పశువుల మేత కోసం గత ఏడాది రూ.50 వేల విలువైన వరిగడ్డిని, ఈ ఏడాది మరో రూ.50 వేల విలువైన వరిగడ్డితో పాటు సుమారు రూ.30 వేల విలువైన జొన్న సొప్పను కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. అయితే గ్రామంలో ఉన్న చెత్త సేకరణ కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు వేసిన బూడిదలోని నిప్పురవ్వలు గాలికి ఎగిరి గడ్డివాముపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో సుమారు లక్ష రూపాయలకు పైగా విలువైన పశువుల మేత పూర్తిగా బూడిదైంది. గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించగా, తరువాత సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. దీంతో పక్కనే ఉన్న మరికొన్ని గడ్డివాములు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా సంబంధిత రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడం గ్రామస్థుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. బాధిత రైతు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినా ఇప్పటివరకు నష్టం అంచనా వేసే చర్యలు ప్రారంభం కాలేదని వారు చెబుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన వైఎస్సార్సీపీ సమాచార హక్కు చట్టం విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టాల రాజు మాట్లాడుతూ, ప్రమాదంలో సర్వం కోల్పోయిన రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి నష్టం అంచనా వేసి ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.
ఇకనైనా అధికారులు స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని, లేకపోతే ప్రజల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

