– స్ఫూర్తి పత్రికలో వార్త తర్వాత కదిలిన అధికారులు
– మొలగవల్లి కొట్టాల్లో అగ్నిప్రమాదంపై అధికారుల పరిశీలన
– బాధిత రైతు నష్టంపై వివరాల సేకరణ
ఆలూరు, మార్చి 08 (స్ఫూర్తి పత్రిక):
ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాల గ్రామంలో రైతు జయన్నకు చెందిన గడ్డివాము అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఘటనపై చివరికి అధికారులు స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించి స్ఫూర్తి పత్రికలో వార్త ప్రచురితమైన తరువాత రెవెన్యూ అధికారులు కదిలి ఘటన స్థలాన్ని సందర్శించారు.
మొలగవల్లి కొట్టాల గ్రామానికి చెందిన రైతు జయన్న పశువుల మేత కోసం నిల్వ ఉంచుకున్న గడ్డివాము అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా సంబంధిత అధికారులు స్పందించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్ఫూర్తి పత్రికలో ప్రచురించడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది.
దీంతో సంబంధిత గ్రామ వీఆర్వో గాదిలింగప్ప ఘటన స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గడ్డివాము దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత రైతుకు జరిగిన నష్టం పై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా వీఆర్వో మాట్లాడుతూ జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను సేకరించి పై అధికారులకు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. అధికారులు నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో స్ఫూర్తి పత్రికలో వార్త ప్రచురితమైన తరువాత అధికారులు స్పందించి ఘటన స్థలాన్ని సందర్శించడంతో బాధిత రైతు మరియు గ్రామస్థులు కొంత ధన్యవాదాలు వ్యక్తం చేశారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన స్ఫూర్తి పత్రికకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

