📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్పదో తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత

పదో తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత

📰 Generate e-Paper Clip

– పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు
– మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పోలీసుల ప్రత్యేక చర్యలు
– జిరాక్స్ సెంటర్లు మూసివేత, స్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ట భద్రత
– అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలి

కర్నూలు, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక):

ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా మరియు సజావుగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, ప్రశ్నాపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్తున్నప్పుడు, అలాగే సమాధాన పత్రాలను తిరిగి తరలించే సమయంలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉండడంతో పరీక్షా కేంద్రాల ఆవరణలో అనవసరంగా ఇతర వ్యక్తులు గుమికూడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను కూడా తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.

జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అవసరానికి అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవకతవకలు, మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా విద్యాశాఖ సహా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టినట్లు వెల్లడించారు.

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరు కావాలని, తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బంది మరియు విద్యార్థులు పరీక్షల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

పరీక్షల సమయంలో ఎవరైనా మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా, లేదా అలాంటి చర్యలకు సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే డయల్ 112 లేదా 100కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!