📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు… పదో తరగతి పరీక్షలకు హోళగుందలో పూర్తి ఏర్పాట్లు

ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు… పదో తరగతి పరీక్షలకు హోళగుందలో పూర్తి ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

– మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో మారిన బడి సమయాలు
– మండలంలో మూడు పరీక్ష కేంద్రాల్లో 734 మంది విద్యార్థులు పరీక్షలు
– పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు
– విద్యార్థులకు తాగునీరు, మౌలిక వసతులు సిద్ధం

హోళగుంద, మార్చి 15 (స్ఫూర్తి పత్రిక):

వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మండల విద్యాధికారులు సుధారాణి, కబీర్ సాబ్ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.

ఈ మేరకు ప్రాథమిక పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఉన్నత పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

ఇదే సమయంలో సోమవారం ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారులు వెల్లడించారు. పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎ సెంటర్‌లో 304 మంది విద్యార్థులు, బి సెంటర్‌లో 291 మంది విద్యార్థులు, అలాగే కేజీబీవీ సెంటర్‌లో 139 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. మొత్తం 734 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం తగిన సంఖ్యలో డెస్కులు, బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక వసతులను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

పరీక్షలు క్రమబద్ధంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొనేలా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉండనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకుని పరీక్ష ప్రారంభానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని మండల విద్యాధికారులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!