📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్పన్నులు సకాలంలో చెల్లిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యం

పన్నులు సకాలంలో చెల్లిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యం

📰 Generate e-Paper Clip

– ప్రజలకు స్వర్ణ పంచాయతీ పోర్టల్‌పై అవగాహన
– ఆన్‌లైన్ ద్వారా పన్నులు చెల్లించాలని సూచన
– పంచాయతీ కార్యాలయంలో కూడా చెల్లింపు సౌకర్యం
– గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

హోళగుంద, మార్చి 15 (స్ఫూర్తి పత్రిక):

గ్రామాల అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని, గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇల్లు, కొళాయి, దుకాణాలు మరియు ఇతర పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి రాజశేఖర్ గౌడ్ సూచించారు.

ఆదివారం గ్రామ ప్రజలకు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన “స్వర్ణ పంచాయతీ పోర్టల్” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో పన్నుల వసూళ్లను సులభతరం చేయడం మరియు పారదర్శకత పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రారంభించిందని తెలిపారు.

గతంలో బిల్ కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేసే విధానం ఉండేదని, ప్రస్తుతం డిజిటల్ విధానంలో ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ పన్నులను చెల్లించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఇంటి పన్ను, కొళాయి పన్ను, దుకాణాల పన్ను తదితర గ్రామపంచాయతీకి సంబంధించిన అన్ని రకాల పన్నులను సులభంగా చెల్లించవచ్చని తెలిపారు.

స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి సిబ్బంది సహాయంతో తమ పన్నులను చెల్లించుకోవచ్చని చెప్పారు. పన్నులు చెల్లించిన వెంటనే స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ రసీదు పొందే విధానం కూడా అందుబాటులో ఉందని వివరించారు.

గ్రామాలలో రహదారులు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు, మౌలిక వసతులు మెరుగుపరచడానికి పన్నుల వసూళ్లు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ బాధ్యతగా భావించి పన్నులు సకాలంలో చెల్లిస్తే గ్రామాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయవచ్చని తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ప్రజలు ముందుకు వచ్చి పంచాయతీకి సహకరించాలని, పన్నులు చెల్లించడం ద్వారా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పంచాయతీ అభివృద్ధి అధికారి రాజశేఖర్ గౌడ్ కోరారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!