– వీరశైవ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం
– బసవ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపనకు నిర్ణయం
– కార్యక్రమానికి గ్రామస్తులకు ఆహ్వానం
హోళగుంద, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక):
మండల కేంద్రంలో వీరశైవుల ఆరాధ్య దైవం, విశ్వగురు జగద్‌జ్యోతి బసవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని వీరశైవ సంఘం నాయకులు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరశైవ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకునే బసవ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 20న బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు తెలిపారు. హోళగుందలోని శ్రీ సిద్దేశ్వర స్వామి తేరు బజారు ప్రాంతంలో విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
బసవేశ్వర స్వామి సమానత్వం, సామాజిక న్యాయం మరియు భక్తి మార్గాన్ని ప్రజలకు బోధించిన మహనీయుడని వారు పేర్కొన్నారు. సమాజంలో సత్యం, ధర్మం, నైతిక విలువలను స్థాపించడంలో బసవేశ్వర స్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.
విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. బసవ జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ ప్రజలు, భక్తులు సహకరించాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు హెచ్. శివశంకర్ గౌడ, గవి సిద్దప్ప, ఉపాధ్యాయులు దొడ్డబసప్ప, బసవరాజు గౌడ, సొల్లిగి తిప్పన్న, వీరభద్రతో పాటు గ్రామస్తులు కురువ గాదిలింగ, వడ్డే ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.

