- విన్నర్‌కు రూ.20 వేల నగదు బహుమతి
- కెఎంటీ జట్టు రన్నర్‌గా నిలిచింది
- యువతకు క్రీడాస్ఫూర్తి సందేశం
హోళగుంద, మార్చ్ 23 (స్ఫూర్తి పత్రిక):
హోళగుంద మండలంలోని పెద్దహ్యాట గ్రామంలో గ్రామ దేవర సందర్భంగా నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది. యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగగా వందవాగలి జట్టు విజేతగా నిలిచి విన్నర్ కప్‌ను అందుకుంది. విజేత జట్టుకు కప్‌తో పాటు రూ.20,000 నగదు బహుమతిని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్, యువనాయకుడు లక్ష్మీనారాయణ గౌడ్ అందజేశారు.పోటీల్లో చివరి వరకు పోరాడిన కెఎంటీ జట్టు రన్నర్‌గా నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ జట్టుకు రన్నర్ కప్‌తో పాటు రూ.15,000 నగదు బహుమతిని ఎన్‌సీ శివప్రకాశ్ అందజేశారు. మూడవ స్థానంలో నిలిచిన పెద్దహ్యాట జట్టుకు రూ.10,000 నగదు బహుమతిని చిన్నహ్యాట మంజునాథ్ అందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు.పెద్దహ్యాట దేవర పురస్కరించుకుని ఇంత పెద్ద స్థాయిలో కబడ్డీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.

