- భూముల రీ సర్వేలో అవకతవకలపై సిపిఐ, రైతు సంఘం ఆందోళన
- ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ
- సర్వే లేకుండానే పూర్తిచేసినట్లుగా చూపుతున్నారన్న ఆరోపణలు
- పేద రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్
ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక):
గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆలూరు ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ శోభ సువర్ణమ్మకు వినతిపత్రం సమర్పించి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. భూపేష్, సిపిఐ మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, అనేక గ్రామాల్లో అమలు లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. భూముల సరిహద్దుల గుర్తింపు, పాత వివాదాల పరిష్కారం వంటి అంశాల్లో స్పష్టత లేకపోవడం వల్ల సమస్యలు తగ్గక మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న పేద రైతులకు డి-పట్టా పాస్‌బుక్‌లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రీ సర్వే ద్వారా వారి హక్కులను చట్టబద్ధంగా గుర్తించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా సర్వే నిర్వహిస్తూ, వాస్తవికంగా భూముల కొలతలు చేపట్టకుండా పూర్తిచేసినట్లు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు.
రాజకీయ ప్రభావంతో కొంతమంది సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా, రికార్డుల్లో పూర్తిచేసినట్లుగా నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇటువంటి చర్యలు రైతులను మరింత అనిశ్చితిలోకి నెట్టివేస్తున్నాయని పేర్కొన్నారు.
రీ సర్వే ప్రక్రియ పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, తప్పిదాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎస్.ఎస్. భాషా, రైతు సంఘం అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, కార్యదర్శి చాపల గోపాల్, రామంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

