📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్గేట్లు మూసి, గాంధీజీని మరిచారా? దేవనకొండలో అధికార యంత్రాంగం వైఫల్యం

గేట్లు మూసి, గాంధీజీని మరిచారా? దేవనకొండలో అధికార యంత్రాంగం వైఫల్యం

📰 Generate e-Paper Clip

  • పంచాయతీ, అభివృద్ధి శాఖల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం
  • ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఉన్నా పట్టించుకోని అధికారులు
  • దేవనకొండలో జాతిపిత విగ్రహం దయనీయ స్థితి
  • దేవనకొండలో గాంధీజీకి ఘోర అవమానం!

దేవనకొండ, జనవరి 29 (స్ఫూర్తి పత్రిక):
దేశానికి స్వాతంత్ర్యం సాధించి, అహింస మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో అవమానకర స్థితిలో దర్శనమిస్తోంది. దేవనకొండలోని పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహం చుట్టూ కలుపు, పొదలు, చెత్త పేరుకుపోయి ఉండటంతో అధికారుల నిర్లక్ష్యం బహిరంగంగా కనిపిస్తోంది.

పాత తహసీల్దార్ కార్యాలయ భవనానికి మరమ్మత్తులు చేపట్టలని  నేపథ్యంలో, తాత్కాలికంగా తాసిల్దార్ కార్యాలయాన్ని వేరే భవనానికి మార్చారు. ఆ తర్వాత నుంచి పాత కార్యాలయం గేట్లు మూసివేయబడి, ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని పూర్తిగా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నెలల తరబడి శుభ్రత చర్యలు చేపట్టకపోవడంతో విగ్రహం చుట్టూ కలుపు పెరిగి, పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి.

విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ విగ్రహానికి సమీపంలోనే మండల పరిషత్ అభివృద్ధి శాఖ ఎంపీడీవో కార్యాలయం ఉండగా, రోజూ అధికారులు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నప్పటికీ గాంధీజీ విగ్రహం పరిస్థితిపై ఎవరూ స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. పంచాయతీ సిబ్బంది, అభివృద్ధి శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా మారిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రతి సంవత్సరం గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి సందర్భాల్లో గాంధీ ఆశయాలు, స్వచ్ఛ భారత్, విలువలు అంటూ ప్రసంగాలు చేసే అధికారులు, గాంధీజీ విగ్రహం పరిరక్షణ విషయంలో మాత్రం తమ బాధ్యతను విస్మరించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేపు మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు జరగనున్న వేళ కనీసం ఈ విగ్రహం చుట్టూ శుభ్రత పనులు చేపడతారా, గాంధీజీకి తగిన గౌరవం కల్పిస్తారా, లేక ఈ నిర్లక్ష్యం యథావిధిగా కొనసాగుతుందా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.

ఈ ఘటన స్వచ్ఛ భారత్ నినాదాలకు, గాంధీ ఆశయాలకు పూర్తి విరుద్ధమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులైన కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, గాంధీజీ విగ్రహం చుట్టూ శుభ్రతతో పాటు పరిరక్షణ పనులు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!