- 100 రోజుల ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం
- కాలువలు, చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభం
- భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చర్యలు
- సాగునీటి సంఘాల భాగస్వామ్యంపై దృష్టి
హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో భాగంగా హోళగుంద మండలంలో పనులు ప్రారంభమయ్యాయి. భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి సంరక్షణ ప్రధాన లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు ఎల్‌ఎల్‌సీ ఏఈ ఈశ్వర్ తెలిపారు.సోమవారం స్థానిక 55వ నంబరు డిస్ట్రిబ్యూటరీ వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవికాలంలో నీటి కొరతను తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లు వివరించారు. కాలువల మరమ్మత్తులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పునరుద్ధరణ, పిల్లకాలువల శుద్ధి వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.అదేవిధంగా చెరువులకు వంకల మళ్లింపు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పాత చెక్‌డ్యామ్‌ల మరమ్మత్తులు, పూడికతీత పనులు విస్తృతంగా చేపట్టడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ చర్యలతో భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు రైతులకు సాగునీటి లభ్యత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో కీలకమని, స్థానిక స్థాయిలో సంఘాలు చురుకుగా పనిచేస్తేనే నీటి సంరక్షణ లక్ష్యాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు కూడా నీటి వినియోగంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు ఉస్మాన్, హెబ్బటం ముసలయ్య, సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు సిద్ధిక్, మాజీ అధ్యక్షుడు మిక్కిలినేని శ్రీనివాసులు, సభ్యులు దుర్గప్ప, నాగప్ప, టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య, కర్నూలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుబాన్, టిడిపి నాయకులు మురళి, కురువ మల్లి, రైతులు పాల్గొన్నారు.

