📄 ePaper
Friday, November 20, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్కష్టకాలంలో అండగా నిలిచిన గ్రామానికి - తిరిగి సేవ చేయాలనే సంకల్పం!

కష్టకాలంలో అండగా నిలిచిన గ్రామానికి – తిరిగి సేవ చేయాలనే సంకల్పం!

📰 Generate e-Paper Clip

– పదవి లేకున్నా ప్రజల మధ్యే ప్రస్థానం… నాలుగు దశాబ్దాల అనుబంధానికి మరో అడుగు
– దేవనకొండ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలోకి కట్ట వేణుగోపాల్ రావు
– విమర్శలకు సేవా కార్యక్రమాలే సమాధానమంటూ విలేకరుల సమావేశంలో వెల్లడి

దేవనకొండ, నవంబర్ 17 (స్ఫూర్తి పత్రిక):

ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారంగా దేవనకొండకు వచ్చి, ఇక్కడి నేలతో, ఇక్కడి ప్రజలతో అనుబంధం పెంచుకున్న కుటుంబం కష్టకాలంలో గ్రామ ప్రజలు అందించిన అండను మరువకుండా, తమ వంతుగా గ్రామానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన కుటుంబం ఇప్పుడు గ్రామ అభివృద్ధిలో మరింత బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగింది. అదే కట్ట వేణుగోపాల్ రావు కుటుంబ ప్రస్థానం.దేవనకొండ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచిన కట్ట వేణుగోపాల్ రావు మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబ నేపథ్యం, గ్రామంతో తమకున్న అనుబంధం, గతంలో చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణాలను వివరించారు. తనకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఉపయోగించుకోవాలన్నదే తన సంకల్పమని తెలిపారు.

వ్యవసాయంతో మొదలైన అనుబంధం… గ్రామ ప్రజలతో పెరిగిన బంధం

తన తండ్రి రామారావు గారు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం గుంటూరు ప్రాంతం నుంచి దేవనకొండకు వచ్చి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించారని వేణుగోపాల్ రావు గుర్తుచేశారు. స్థానిక కుటుంబాల నుంచి వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తూ, వ్యవసాయ పనుల ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించారని తెలిపారు. రైతుల కష్టసుఖాలను దగ్గరగా చూసిన తన తండ్రి, వ్యవసాయ అనుభవంతో ఇతర రైతులకు కూడా పంటల సాగు, మందుల వినియోగం వంటి విషయాల్లో తనకు తెలిసిన సూచనలు, సలహాలు అందించేవారని వివరించారు.వ్యవసాయంలో ప్రతి కాలం ఒకేలా ఉండదని, పంటలు ఆశించిన దిగుబడిని ఇవ్వకపోవడం, నష్టాలు ఎదురుకావడం వంటి కష్టకాలాలు తమ కుటుంబానికీ వచ్చాయని తెలిపారు. అటువంటి సమయంలో దేవనకొండ గ్రామ ప్రజలు తమ కుటుంబానికి అండగా నిలిచారని, ఆ సహాయ సహకారాలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు చూపిన ఆదరణ, ఆప్యాయత తమ కుటుంబానికి దేవనకొండతో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరిచాయని చెప్పారు.తన తండ్రి రామారావు గారు అప్పట్లో చెప్పిన మాటలను ఇప్పటికీ మరచిపోలేదని, మనకు కష్టకాలంలో అండగా నిలిచిన గ్రామానికి మనం కూడా చేతనైనంత మంచి చేయాలని, ప్రజలకు ఉపయోగపడేలా జీవించాలని ఆయన ఇచ్చిన సందేశమే తమకు మార్గదర్శకమని వేణుగోపాల్ రావు తెలిపారు. తండ్రి చూపిన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతోనే ఇప్పటివరకు ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

పదవి లేకున్నా ఆలయాలకు, సామాజిక కార్యక్రమాలకు సహకారం

ప్రజాసేవ చేయడానికి పదవి తప్పనిసరి కాదనే భావనతో తమ కుటుంబం గతంలోనే పలు కార్యక్రమాలకు సహకరించిందని వేణుగోపాల్ రావు తెలిపారు. దేవనకొండలోని చెన్నకేశవస్వామి దేవాలయ అభివృద్ధికి, అయ్యప్పస్వామి ఆలయానికి, దేవనకొండ మండల పరిధిలోని గద్దిరాళ్ల మారెమ్మ అవ్వ దేవాలయానికి తమ కుటుంబం లక్షల రూపాయల విరాళాలు అందించిందని వివరించారు.ముఖ్యంగా కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన అయ్యప్పస్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు ఆర్థిక సహకారం అందించామని, ఆలయంలో నిత్య దీపారాధనతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగేందుకు సహకరించామని పేర్కొన్నారు. అంతేకాకుండా పాఠశాలలు, సామాజిక కార్యక్రమాలు, గ్రామంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తమ వంతు సహాయం అందించామని తెలిపారు. ఈ సహకారాలు ఏదో ఒక పదవిలో ఉండి చేసినవి కావని, గ్రామంతో ఉన్న అనుబంధం, మానవతా దృక్పథంతోనే అందించామని స్పష్టం చేశారు.గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సొంత సమస్యలుగా భావించి, సాధ్యమైనంత వరకు పరిష్కారానికి సహకరించామని తెలిపారు. అన్ని కులాలు, సామాజిక వర్గాల ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ, వారి సుఖదుఃఖాల్లో భాగస్వాములయ్యామని చెప్పారు. గ్రామానికి ఏదైనా చేయాలనే ఆలోచన తమ కుటుంబంలో ఎప్పటి నుంచో ఉందని, ఆ సేవా భావాన్ని మరింత విస్తరించాలన్నదే తన ఉద్దేశమని వెల్లడించారు                         .

విమర్శల మధ్య వేణుగోపాల్ రావు స్పందన… సర్పంచ్ పదవి అధికారం కాదు, ప్రజలకు బాధ్యత

ఇటీవల కొందరు నాయకులు తమ కుటుంబంపై విమర్శలు చేస్తూ, గ్రామంలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వేణుగోపాల్ రావు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అయితే తమ కుటుంబం దేవనకొండకు వచ్చినప్పటి నుంచి ప్రజలతో కొనసాగిస్తున్న అనుబంధం, గతంలో చేపట్టిన సహాయ కార్యక్రమాలను గ్రామ ప్రజలు పరిశీలించాలని కోరారు.స్థానికులు, స్థానికేతరులు అనే చర్చల కంటే గ్రామానికి ఎవరు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? గ్రామ సమస్యల పరిష్కారానికి ఎవరు ముందుకొస్తున్నారు? భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి ఎవరి దగ్గర స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి? అనే అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గ్రామానికి మంచి చేయాలనే ఆలోచనకు ప్రాంతం, స్థానికత అడ్డంకి కాకూడదని, గ్రామ ప్రజలందరి ఆశీస్సులు, సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలనేదే తన ఆకాంక్షని తెలిపారు.గతంలో తమ కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలు ఎలాంటి పదవులు ఆశించి చేసినవి కావని, ప్రజలకు సహాయం చేయాలనే మానవతా దృక్పథంతోనే కొనసాగించామని చెప్పారు. అయితే గ్రామపంచాయతీ సర్పంచ్ హోదా లభిస్తే ప్రజల సమస్యలను మరింత బాధ్యతతో, క్రమబద్ధంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం రిజర్వేషన్ కారణంగా పోటీ చేసే అవకాశం లేకపోయిందని, ప్రస్తుతం ఈ స్థానం జనరల్‌ (అనరిజర్వుడ్‌) కేటగిరీలోకి రావడంతో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లభించిందని వివరించారు. తన తండ్రి రామారావు గారు చూపిన మార్గంలో నడుస్తూ, గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.సర్పంచ్ పదవిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనే ఆలోచన తమకు లేదని, అక్రమ సంపాదన కోసం కానీ, వ్యక్తిగత లాభాల కోసం కానీ తాము ఎన్నికల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రతి వార్డు, ప్రతి సామాజిక వర్గం ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు.గతంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమకు సాధ్యమైనంత మేర గ్రామానికి సేవలు అందించారని గుర్తుచేస్తూ, తనకు కూడా అవకాశం లభిస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని అన్నారు.మా కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు దేవనకొండ ప్రజలు అండగా నిలిచారు. ఆ సహాయాన్ని ఎప్పటికీ మరువలేం. మా తండ్రిగారు కూడా గ్రామానికి మంచి చేయాలని, ప్రజలకు ఉపయోగపడాలని ఎప్పుడూ చెప్పేవారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు సహాయం చేయాలనే మా ఆలోచన మారదు. సర్పంచ్ బాధ్యత లభిస్తే గ్రామ అభివృద్ధికి మరింత క్రమబద్ధంగా కృషి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి మద్దతు, ఆశీస్సులు కోరుకుంటున్నాం అని వేణుగోపాల్ రావు పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండి గింజల రంగన్న, ఎంపీటీసీ ఆకుల వీరేష్, మాజీ సైనికుడు, జనసేన నాయకుడు రామాంజి, జనసేన నాయకుడు చంటిబాబు, సరోజ, టీడీపీ నాయకులు శిలివేరి శ్రీరాములు, ముద్దన సదాశివరావు, కుక్కల తిమ్మయ్య, బండల రామాంజనేయులు, రంగయ్య, ఆటో రంగయ్య, బజారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!