📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహణ

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

– ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు మార్గం
– దేవనకొండలో చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళి
– తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు

దేవనకొండ, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక):

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని దేవనకొండలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని తెలిపారు.

మార్చి 16, 1901న మద్రాస్‌లో మహాలక్ష్మమ్మ, గురువయ్య దంపతులకు పొట్టి శ్రీరాములు జన్మించారు. కుటుంబ పరిస్థితుల మధ్య పెరిగిన ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసి బొంబాయిలో శానిటరీ ఇంజినీరింగ్ డిప్లొమా చేశారు. అనంతరం రైల్వే శాఖలో ఉద్యోగం చేశారు.

తల్లి, భార్య మరణంతో జీవితంలో తీవ్ర మార్పు వచ్చి ఉద్యోగాన్ని వదిలి మహాత్మా గాంధీ ప్రభావంతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. ఖాదీ ప్రచారం, మధ్యపాన నిషేధం, హరిజన సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించేందుకు పోరాడిన ఆయన సమానత్వాన్ని ప్రచారం చేస్తూ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్యం అనంతరం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం అవసరమని భావించి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 1952 అక్టోబర్ 10న మద్రాస్‌లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజుల దీక్ష అనంతరం డిసెంబర్ 16, 1952న ప్రాణత్యాగం చేశారు. ఆయన త్యాగంతో తెలుగు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగి చివరకు 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఉచ్చీరప్ప, రంగన్న, మాజీ సర్పంచ్, మాజీ సైనికుడు బి. రామాంజినేయులు, సి. మల్లికార్జున, బి. రంగన్న, పి. షేకన్న, రామాంజినేయులు, బిలాలి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!